Skip to content

ప్రజాకవి హన్మంతు

May 10, 2010
May 6th 2010, Visalandhra Daily
స్ఫూర్తి
కామ్రేడ్‌ సుద్దాల హన్మంతు కవిగా, కళాకారుడుగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. శత్రువుతో పోరాడి నెగ్గినా-క్యాన్సర్‌ వ్యాధితో పోరాటంలో ఓడిపోయి అక్టోబరు 10, 1982న కన్నుమూశారు.
పుట్టింది రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామ పేద పద్మశాలి కుటుంబంలో, విద్య పెద్దగా లేదు- ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్థూ, తెలుగుభాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు.
అవి నిజాం రాచరిక నిరంకుశత్వం విలయతాండవం చేస్తున్న రోజులు. దొరలు- జమీందార్లు, పటేల్‌- పట్వారీలు, గ్రామ పెత్తందార్ల ఇష్టారాజ్యం సాగుతున్న కాలం. వెట్టిచాకిరి ప్రజలకి గుదిబండగా మారిన దుర్దినాలు. హన్మంతు తండ్రి ఆయుర్వేద వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాదు చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
ఇంతలో ఆంధ్ర మహాసభ మహోద్యమంగా మారు తోంది. పల్లెపల్లెనా”సంఘం” వెలుస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి పల్లెల వైపు పయనించాడు హన్మంతు. ఆంధ్ర మహాసభ 11వ మహాసభ భువనగిరి పట్టణంలో జరుగుతుంది. యువతరం నాయకుడు-విప్లవ నాయకుడు కామ్రేడ్‌ రావి నారాయణరెడ్డి ఆ మహా సభకు అధ్యక్షులు. హన్మంతు అక్కడికి చేరాడు. వాలంటీరుగా పనిచేశాడు. నాయకుల సందేశాలు విని, మహాసభ నిర్ణయాలు తెలుసుకొని, ఆర్య సమాజాన్ని విడిచి ఆంధ్ర మహాసభ ఆశయాలను, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు.
సుద్దాల గ్రామంలో స్థిరనివాస మేర్పరుచుకొని, చుట్టు ప్రక్కల గ్రామాల్లో ”సంఘం” స్థాపించడానికి, పంచ కమిటీలు నియమించడానికి హన్మంతు కృషి చేశాడు.
దొరల- జమీందార్ల దౌర్జన్యం, ప్రభుత్వపు దౌర్జన్యమూ పెరిగింది. 1946లో నల్లగొండజిల్లాలో మార్షల్‌ లా విధించబడింది. దాడుల నెదుర్కోవడానికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన దళాలు ఏర్పడ్డాయి. దళంలో చేరి, శిక్షణ పొంది శత్రువు నెదిరించడానికి తుపాకి పట్టాడు హన్మంతు. ప్రజల్ని కదిలించడానికి, కలం కదిపాడు-గొంతు విప్పాడు. పోరాట లక్ష్యాన్ని వివరిస్తూ నిజాం, నియంత, దొరల దేశ్‌ముఖుల క్రూరత్వాలను తెలుపుతూ, ప్రజల భాషలో, జానపద శైలిలో పాటలు రాస్తూ, గానం చేస్తూ కదనరంగంలో నిలిచాడు హన్మంతు. అనేక మంది కవులు, కళాకారులు తమ కలాలు, గళాలు కలిపారు. అయితే తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హన్మంతు రణరంగంలో వున్న ప్రజాకవులు. హన్మంతు అనుచరుడు, సహచరుడు అమరజీవి యాదగిరి ఈటెలలాటి మాటలతో పాటనల్లి పోరాట రంగంలో నేలకొరిగాడు.
పల్లెపాడు ప్రాంతంలో ”సంఘం” పెట్టాడని, ఎర్రజెండా ఎత్తాడని, తిరుగుబాటును రేపుతున్నాడని, కమ్యూనిస్టని హన్మంతు పై వారెంటు జారీ చేసింది నిజాం ప్రభుత్వం. పట్టుకోవడం మాత్రం దాని వశం కాలేదు.
హైద్రాబాద్‌ రాష్ట్రాన్ని యూనియన్‌ సైన్యాలు ఆక్రమించుకున్నాయి. నిజాం పాలన అంతమైనా కమ్యూనిస్టులపై దాడి పెరిగింది. అడవుల్లో అజ్ఞాత జీవితం గడుపుతున్న హన్మంతును విషపు పురుగు కాటు వేసింది. చికిత్స చేయించుకోవటం కష్టమైంది. అతి కష్టంమీద మారువేషంలో బొంబాయి చేరాడు.
1952 మొదటి సాధారణ ఎన్నికలు ప్రకటించగానే బొంబాయి నుండి సుద్దాల చేరుకున్నాడు. పిడిఎఫ్‌ అభ్యర్థుల విజయానికై ప్రచార రంగంలో దూకాడు. పాటల, బుఱ్ఱకథ, గొల్లసుద్దలు, ఫకీరు, సాధువేషాలు, పిట్టలదొర, బుడబుక్కల వేషం, రకరకాల వేషాలతో ప్రదర్శనలిచ్చి వేలాది ప్రజలను ఉర్రూత లూగించాడు. ప్రజా కళాకారుడుగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా తన కలాన్ని, గళాన్ని శక్తినంతా వినియోగించి ఆనాటి నుండి జీవితం చివరి ఘడియల దాకా కృషి చేశాడు. పల్లెపల్లె తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. తన రచనల యితివృత్తాలు ప్రజల జీవితాలు- ప్రజా పోరాటాలుగా ఎంచుకున్నాడు. ప్రజల భాషలో జానపద శైలిలో రాసి, గానం చేసిన ప్రజా కళాకారుడు కామ్రేడ్‌ హన్మంతు.
తాలూకా, జిల్లా పార్టీ మహాసభలకు ప్రతినిధిగా హాజరయ్యాడు. పార్టీ నిర్ణయాలను, పోరాట లక్ష్యాలను పాటల్లో ప్రజలకు వివరించాడు.
హన్మంతు పాటలు తెలంగాణ మంతటా వ్యాపించాయి. ఎంతోమంది హన్మంతు శిష్యులుగా, ప్రజా కళాకారులుగా మారారు. హన్మంతు తన కుటుంబాన్ని పార్టీ కుటుంబంగా తీర్చిదిద్దాడు. ఆరోగ్యం క్షీణించినా-లక్ష్యం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి. సుద్దాల గ్రామ సర్పంచ్‌గా దొరల నెదిరించి గెలిచాడు. చనిపోయేనాటికి ఆ పదవిలో వున్నాడు. 70 సంవత్సరాలు నిండినా శక్తికొలదీ తన పార్టీకి సేవ చేయాలనే తపన వున్న వ్యక్తి. స్వార్థం ఎరగని వ్యక్తి, కపటం తెలియని మనిషి, మల్లెపూవులాంటి మనసు-జీవితమంతా భారత కమ్యూనిస్టు పార్టీ ఆశయం కోసం, ప్రజాకళల  ద్వారా పోరాడిన వ్యక్తి-ప్రజాకవి కామ్రేడ్‌ సుద్దాల హన్మంతు. వారికిదే శతజయంతి నివాళి
Advertisements
No comments yet

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: